నీళ్లు తాగిన తర్వాత కూడా మళ్ళీ దాహం వేస్తుందా? అయితే అది ఈ వ్యాధులకు సంకేతం

మనిషికి జీవనాధారం నీరు. అలాంటి నీటిని ఎక్కువగా తాగటం వల్ల ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాదారణంగా శరీరం నీటిని కోరుకుంటున్నప్పుడు మనిషికి దాహం వేస్తుంది. అలాకాక, వర్కౌట్స్ చేసినప్పుడు, చెమట ఎక్కువగా పట్టినప్పుడు, శారీరక శ్రమ పెరిగినప్పుడు, మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు, ఉప్పు ఎక్కువగా తీసుకొన్నప్పుడు, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల దాహం ఎక్కువ వేస్తుంది. అలాకాకుండా, నిరంతరం దాహంగా ఉండటం, లేదా నీరు త్రాగిన తర్వాత కూడా దాహం తీరకపోవడం జరిగితే అది అనేక వ్యాధులకి సంకేతం కావచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

డీహైడ్రేషన్:

సాదారణంగా వేసవిలో ఎండ వేడిమికి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల డీహైడ్రేషన్ సంభవిస్తుంది. అప్పుడు అతిగా దాహం వేయడం, అతిసారా, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనంతటికీ కారణం శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టపోవటమే! అలాగే పొడి చర్మం, పగిలిన పెదవులు, మైకం కమ్మడం, అలసట, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

మధుమేహం:

మధుమేహం ఉన్న వారికి కూడా అత్యధిక దాహం వేస్తుంది. మధుమేహులు ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తుంటారు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు, శరీరం దానిని మూత్రం ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా నిర్జలీకరణం జరుగుతుంది. దీని వల్ల కూడా దాహం ఎక్కువగా అనిపిస్తుంటుంది.

డయాబెటిక్ కీటోయాసిడోసిస్:

డయాబెటీస్ ఉన్నవారికి శక్తిని అందించడానికి కణాలలోకి గ్లూకోజ్ చేరకుండా నిరోధించవచ్చు. ఇలా చేయటం వల్ల శరీరంలో కీటోన్స్ పెరుగుతాయి. ఇది యాసిడ్ గా మారి… కీటోయాసిడోసిస్‌కు దారితీస్తుంది. దీనివల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. అందువల్ల దాహం పెరుగుతుంది. కీటోయాసిడోసిస్ అనేది ఒక ప్రాణాంతక సమస్య. పొడి చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, వికారం, మైకం కమ్మడం, కోమా వంటివి కెటోయాసిడోసిస్ యొక్క ప్రధాన లక్షణాలు.

థైరాయిడ్:

హైపోథైరాయిడిజం ఉన్నవారు కూడా దాహాన్ని కలిగించే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించడంలో కిడ్నీకి సహాయపడే హార్మోన్‌ వ్యవస్థ తగినంతగా హార్మోన్ ని ఉత్పత్తి చేయనందున ఈ సమస్య ఏర్పడుతుంది.

గర్భం:

గర్భిణీ స్త్రీలకు కూడా తరచుగా దాహంగా అనిపిస్తుంటుంది. ఇది ఒక సాధారణ సమస్యే అయినప్పటికీ గర్భధారణ సమయంలో ఏర్పడటం వల్ల దీనిని తీవ్రంగా పరిగణించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహానికి సంకేతం కావచ్చు.

అధిక రక్త నష్టం:

ఇది ప్రధానంగా మహిళలకి పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. శరీరంనుండీ ఎక్కువ రక్తం కోల్పోవటం, లేదా రక్తహీనత ఉన్నప్పుడు దాహం స్థాయిని పెంచుతుంది. పీరియడ్స్, సాధారణంగా, శరీరంలోని ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల సమతుల్యతను మార్చడం ద్వారా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.

ముగింపు:

దాహం విషయంలో, ఆహారంలో కొన్ని ఇతర పదార్ధాలని జోడించాలి. అవి హైడ్రేషన్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. పోషకాలు, మరియు నీటిని కలిగి ఉన్న పండ్లు, మరియు కూరగాయలు కేవలం నీటి కంటే ఎక్కువగా దాహాన్ని తీర్చగలవు. పుచ్చకాయలు, టమోటాలు, నారింజ, పైనాపిల్, పీచు, రేగు, సెలెరీ, బచ్చలికూర, దోసకాయ మొదలైన వాటిని తీసుకోవాలి. కేవలం నీరు త్రాగడానికి బదులుగా లెమన్ వాటర్, కుకుంబర్ వాటర్, లేదా మింట్ వాటర్ ని తాగడం ప్రారంభించాలి.

Leave a Comment