నిద్రలో మీ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు రావటానికి కారణాలు ఇవే!

మనం నిద్రించే సమయంలో అప్పుడప్పుడు మన శరీరంలో కొన్ని విచిత్ర పరిణామాలు చోటుచేసుకొంటాయి. వాటిని వెంటనే గుర్తిస్తే సరేసరి. లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే! అందులో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ తిమ్మిర్లు.

సాధారణంగా మన శరీర భాగాలన్నిటిలో ఉండే నరాలకు మెదడు నుంచి సంకేతాలు సరఫరా అవుతూ ఉంటాయి. ఈ నరాలకు స్వయంగా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడైతే, ఒక భాగంలో ఈ సంకేతాల సరఫరా ఆగిపోతుందో… అప్పుడు మెడ నుంచి ఆ భాగానికి వెళ్లే నరాలలో రక్త సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఆ భాగానికి ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది. అందువల్ల ఆ ప్రాంతమంతా చచ్చుబడినట్లు అయిపోతుంది. ఆ సమయంలో ఆ అవయవాన్ని ముట్టుకుంటే మనకు స్పర్శ తెలియదు. ఇదంతా జరగటానికి కొంతకాలం ముందే అప్పుడప్పుడు ఆ భాగంలో తిమ్మిర్లు వస్తుంటాయి. తిమ్మిర్లు వచ్చాయంటే దాని అర్థం ఫ్యూచర్ లో ఆ భాగం చచ్చుబడబోతుందని.

నిజానికి శరీరంలోని ఏ భాగంలోనైనా తిమ్మిర్లు వస్తే… సూదులతో గుచ్చినట్టు, జివ్వుమని లాగేస్తున్నట్టు ఓ విచిత్రమైన బాధని కలిగిస్తుంది. ఒకరకంగా దీన్నే ‘మొద్దుబారటం’ అని కూడా అంటారు. మెడికల్ టెర్మినాలజీలో దీనినే ‘న్యూరోపతి’ అంటారు.

ఇక ఈ తిమ్మిర్లలో పాజిటివ్‌, నెగిటివ్‌ అనే రెండు రకాలుంటాయి. ఎక్కువసేపు ఒకే యాంగిల్‌లో కూర్చున్నప్పుడు కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిర్లు రావటం సహజమే! ఇలాంటి తిమ్మిర్లయితే సుమారు 10-15 నిమిషాల్లో తగ్గిపోతాయి. ఇవి పాజిటివ్ నంబ్ నెస్ రకానికి చెందినవి. అలాకాక, తిమ్మిర్ల కారణంగా క్రమంగా స్పర్శ తగ్గిపోవటం, నొప్పి కలగటం, అవయవాలు బలహీన పడటం ఇలా అంతా జరిగితే అవి నెగిటివ్‌ నంబ్ నెస్ రకానికి చెందినవి. అయితే, ఈ లక్షణాలు ఎక్కువకాలంపాటు కొనసాగితే దానిని వైద్య పరిభాషలో ‘ప్రెషర్‌ పాల్సీ’ అంటారు.

ఎక్కువ సేపు కంప్యూటర్‌ దగ్గర కూర్చుని పనిచేసేవారు కంప్యూటర్ స్క్రీన్ వైపు తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు తల ముందుకు వస్తూ ఉంటుంది. దీనివల్ల వారిలో భుజాల దగ్గర నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనినే ‘థొరాసిక్‌ ఔట్లెట్‌ సిండ్రోమ్‌’ అంటారు.

ఇది కూడా చదవండి: అర్ధరాత్రుళ్ళు గొంతు ఎండిపోయి… దాహం వేస్తుందా..! దానికి గల కారణాలు ఇవే!

అలానే, గర్భిణుల్లో, మధుమేహుల్లో, స్థూలకాయుల్లో, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ రోగుల్లో, హైపో థైరాయిడ్‌ పేషెంట్లలో, కంప్యూటర్‌ ముందు కూర్చుని ఎక్కువ సేపు పనిచేసేవాళ్లలో వారి అరచేతిలోని మీడియన్‌ నరం పదేపదే ఒత్తిడికి గురవటంవల్ల తిమ్మిర్లు మొదలవుతాయి. దీనిని వైద్య పరిభాషలో ‘కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌’ అంటారు.

మోచేతిని తాకినప్పుడు వేళ్లకు వెళ్ళే లావాటి నరం ఒకటి ఉంటుంది. దానిని అల్నార్‌ అంటారు. మోచేయి గోడకు బలంగా గుద్దుకున్నప్పుడు ఈ నరం ఒత్తిడికి గురై… జివ్వుమని షాక్‌ కొట్టినట్టు అనిపిస్తుంది. అలానే, చేతిలోని చివరి రెండు వేళ్లను ఎక్కువగా కదిలించేవారు ఉదాహరణకి తబల, ఫ్లూట్ కళాకారుల్లో ఈ సమస్య ఎక్కువగా బాదిస్తుంది. దీనిని మెడికల్ టెర్మినాలజీలో ‘అల్నార్‌ న్యూరోపతి’ అంటారు.

మధుమేహ రోగుల్లో ప్రధానంగా కనిపించే లక్షణం తిమ్మిర్లు. ప్రారంభంలో కాళ్లకే పరిమితమైనా… ఇది పెరిగేకొద్దీ అన్ని అవయవాలకూ పాకొచ్చు. కొన్ని సందర్భాల్లో శరీరం మొత్తం కూడా తిమ్మిర్లు రావొచ్చు. డయాబెటిక్ ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చే ఇన్సులిన్‌ వల్ల కూడా ‘ఇన్సులిన్‌ న్యూరైటిస్‌’ అనే వ్యాధి రావచ్చు.

పిల్లల్లోను, 25 ఏళ్లలోపు వయసు వారిలోను వచ్చే ఫ్యాబ్రీస్‌ డిసీజ్‌ తిమ్మిర్లే ఫ్యూచర్ లో పక్షవాతానికి దారితీస్తాయి. ఫ్యాబ్రీస్‌ డిసీజ్‌ తిమ్మిర్ల కారణంగా చర్మంపై పిగ్మెంటేషన్‌ కూడా కనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల శరీరంలోని ఏ అవయవమైనా ఎఫెక్ట్‌ అవ్వొచ్చు. కొన్నిసార్లు పక్షవాతం వచ్చిన తర్వాత కూడా ఎఫెక్ట్‌ అయిన ప్రాంతంలో తిమ్మిర్లు రావొచ్చు.

వంశపారంపర్యంగా కూడా ఈ తిమ్మిర్లు సంక్రమించవచ్చు. ఈ రకమైన డిసీజ్ ని ‘హెరిడిటరీ న్యూరోపతీ లయబిలిటీ టు ప్రెషర్‌ పాల్సీస్‌’ అంటారు. వీళ్ళు చాలా తేలికగా తిమ్మిర్లకు గురవుతూ ఉంటారు.

ఇవేకాక ఇంకా అనేక కారణాల వల్ల కూడా తిమ్మిర్లు రావొచ్చు.

డిస్క్లైమర్:

సమస్య ఏదైనా సరే చేతులు, లేదా కాళ్ళలో తిమ్మిర్లు మొదలై… అది కొద్ది రోజులకే పరిమితం కాకుండా ఎక్కువ రోజులు బాదిస్తున్నట్లితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. ఇందులోని అంశాలన్ని కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. సందేహాలు ఏవైనా ఉంటే నిపుణులను సంప్రదించండి.

Leave a Comment