మనకి తెలిసి చాలామంది ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ వల్ల వచ్చిందా? లేక గుండెపోటు వల్ల వచ్చిందా? అనేది గుర్తించలేకపోతారు. ఇది దేనికి సంకేతమో తెలియక అయోమయంలో పడతారు. నిజమైన గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా పరిగణించి విస్మరిస్తారు. చేతులారా వారి ప్రాణాలను వారే పోగొట్టుకుంటారు.
కొన్నిసార్లు గుండెనొప్పి, గ్యాస్ నొప్పి మధ్య తేడా కనుగొనటం కష్టమే అయినప్పటికీ, సరిగ్గా ఆలోచిస్తే వాటి మద్య వ్యత్యాసం ఈజీగా అర్ధమవుతుంది. ఈరోజు మనం గ్యాస్ నొప్పి, గుండెపోటు మధ్య ఉన్న తేడా ఏమిటో క్లియర్ గా తెలుసుకుందాం.
గుండె నొప్పి అంటే ఏమిటి?
కరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగా గుండె నొప్పి వస్తుంది. ఇందులో సిరల్లోకి రక్తం చేరకపోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకు పోతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండె పనితీరు మందగిస్తుంది. క్రమంగా అది పనిచేయడం ఆగిపోతుంది. దీంతో అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. దీని కారణంగా వ్యక్తి కోలుకునే అవకాశం చాలా తక్కువ. దీనినే ‘గుండె పోటు’, ‘హార్ట్ ఎటాక్’, ‘హార్ట్ పెయిన్’ లేదా ‘కార్డియాక్ అరెస్ట్’ అని అంటారు.
గ్యాస్ నొప్పి అంటే ఏమిటి?
కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి కారణంగా గ్యాస్ నొప్పి వస్తుంది. మారిన జీవనశైలి, తీవ్ర మానసిక ఒత్తిడి, కారణం లేకుండానే కోపం రావటం, ఆహారం నియమాలు పాటించక పోవటం, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు వంటి గతి తప్పిన జీవనశైలి కారణంగా తీవ్రమైన ఇండైజేషన్ సమస్యలు తలెత్తుతాయి. దీనినే ‘కడుపు ఉబ్బరం’ ‘గ్యాస్ పెయిన్’, లేదా ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ అని అంటారు.
గ్యాస్ నొప్పి, గుండెపోటు మధ్య వ్యత్యాసం ఏమిటి?
గ్యాస్ సమస్య కారణంగా ఛాతీలో ఎక్కువ నొప్పి, మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, ఉబ్బినట్లు అనిపించడం ఉంటుంది. అతిగా తినడం వల్లనైనా, లేదా ఖాళీ కడుపుతో ఉండటం వల్లనైనా గ్యాస్ సమస్య రావొచ్చు. ఈ గ్యాస్ నొప్పి సరిగ్గా ఛాతీ మధ్య భాగంలో సంభవిస్తుంది.
ఇక గుండెపోటులో బలమైన నొప్పి కలుగుతుంది. గుండెలో క్యాట్రిడ్జ్లో అడ్డుపడటం వలన రావచ్చు. టీ లేదా కాఫీ అధికంగా తీసుకోవడం, అధిక ధూమపానం, అధిక రక్తపోటు, అధిక బరువు, మధుమేహం వంటివి ఈ గుండెపోటును ప్రేరేపిస్తాయి. గుండెపోటు సమయంలో ఛాతీ ఎడమ వైపున తీవ్రమైన నొప్పి, మరియు ఒత్తిడి కలుగుతుంది.
గుండెపోటు లక్షణాలు:
- ఛాతీ ఎడమ వైపున తీవ్రమైన నొప్పి
- గుండె బరువుగా అనిపించటం
- గుండె గట్టిపడటం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- చెమటలు పట్టటం
- మైకం కమ్మటం
- రెండు చేతులు గుంజినట్లు ఉండటం
- మెడ నొప్పి
గ్యాస్ నొప్పి లక్షణాలు:
- ఛాతీ మధ్యలో నొప్పి
- పొత్తికడుపు నొప్పి
- అపానవాయువు
- యాసిడ్ రిఫ్లక్స్
- కడుపులో మంట
- నోటిలో పుల్లని రుచి
చివరి మాట:
పైన చెప్పుకొన్న విషయాల ఆధారంగా గుండెపోటు, మరియు గ్యాస్ నొప్పి మద్య తేడాలను గమనించండి. అత్యవసరమైతే డాక్టర్ ని సంప్రదించండి.
డిస్క్లైమర్:
ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.