వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు ఏర్పడటం కామనే! కానీ, ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే దీర్ఘ కాలిక రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం బిజీ షెడ్యూల్, లైఫ్ స్టైల్ చేంజ్, స్ట్రెస్, డిప్రెషన్. వీటన్నిటి ఫలితంగా 30-40 ఏళ్ల వయస్సులోనే తీవ్ర అనారోగ్యాలకి గురవుతున్నారు. అయితే, ఆరోగ్య సంరక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఆయుర్వేదంలో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో మూలికల వినియోగం కూడా ఒకటి. అలాంటి మూలికలలో అశ్వగంధని మించింది వేరొకటి లేదు.
అశ్వగంధ అంటే ఏమిటి?
అశ్వగంధ అనేది ఔషధ గుణాలు కలిగిన ఒక మూలిక. ఆయుర్వేదంలో దీనిని అనేక అనారోగ్య సమస్యలకి విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇంకా ఇది భారతదేశంలోని ఓ సాంప్రదాయ ఔషధం.
నిజానికి హెర్బల్ ప్రొడక్ట్స్ లో అశ్వగంధని రారాజుగా చెప్పుకోవచ్చు. ఇది అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకరకంగా దీనిని ‘మాయా మూలిక’ అన్నా కూడా తప్పులేదు. ఎందుకంటే, నిజంగానే అశ్వగంధకి అనేక అనారోగ్య సమస్యలని మాయం చేసే శక్తి ఉంది. అశ్వగంధ మూలిక పేరు చాలామంది వినే ఉంటారు. కానీ దాని ఉపయోగాల గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరిప్పుడు అశ్వగంధతో ఏయే అనారోగ్యాలకి చెక్ పెట్టచ్చో తెలుసుకుందాం.
హై బ్లడ్ ప్రెజర్:
దీర్ఘ కాలిక రోగాలలో హై బీపీ ఒకటి. హై బీపీని చాలా కాలం పాటు గుర్తించకపోతే… గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్, డిప్రెషన్ వంటివి బీపీ రావటానికి ముఖ్య కారణాలు. అయితే, ఈ హెర్బ్ సహాయంతో మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటే, బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అశ్వగంధను తీసుకున్నట్లయితే దీనిని అధిగమించవచ్చు.
ఏజింగ్ ప్రాబ్లెమ్స్:
అశ్వగంధకి శరీరాన్ని పునర్జీవింప చేసే శక్తి కలిగి ఉంది. అలాగే, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగు పరుస్తుంది. దీనిని తీసుకుంటే చర్మం శుద్ధి అవుతుంది. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలను కూడా తప్పిస్తుంది.
నిద్రలేమి:
అశ్వగంధలో మంచి నిద్రని ఇచ్చే గుణాలు ఉన్నాయి. దీనిని తీసుకుంటే, హాయిగా నిద్ర పోవచ్చు. ఎంతోకాలంగా నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నా సరే… అశ్వగంధ దానిని చిటికెలో పోగొడుతుంది. కాబట్టి అశ్వగంధని తీసుకున్నట్లైతే నిద్రలేమి సమస్యకు దూరంగా ఉండొచ్చు.
ఒత్తిడి, మరియు ఆందోళన:
అశ్వగంధలో ఒత్తిడి మరియు ఆందోళనలు తగ్గించే గుణాలు అదికంగా ఉన్నాయి. ఈ హెర్బ్ లో ఉన్న ప్రత్యేక గుణం ఇదే! ఎప్పుడైతే, ఒత్తిడి తగ్గుతుందో మనసు ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది.
మెమరీ:
జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవారు అశ్వగంధని తీసుకుంటే కోలైన్ లెవెల్స్ పెరుగుతాయి తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే, ఇంటలిజెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది.
ఇమ్యూనిటీ:
అశ్వగంధ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇమ్యూనిటీ పెరగటం వల్ల అనేక వ్యాధుల నుండీ బయటపడొచ్చు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది ఇటువంటి సమయంలో ఇమ్యూనిటీని ఎక్కువగా పెంచుకోవాలని డాక్టర్లు అంటున్నారు. అలాంటి వారిపై అశ్వగంధ బాగా పనిచేస్తుంది.
ఎనర్జీ:
అశ్వగంధ ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. అడ్రినల్ గ్రంథులు రిలీజ్ చేసే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ లెవెల్స్ ని ఇది సమర్థవంతంగా చేస్తుంది. అలాగే, ఫిజికల్ యాక్టివిటీని సైతం ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ను కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. నీరసంగా ఉండే వాళ్ళని వేగంగా రికవరీ చేస్తుంది.
రుమాటిజం:
కీళ్ల వాతం తో బాధ పడే వారికి ఇది ఒక మంచి మూలిక అని చెప్పొచ్చు. అశ్వగంధని వాడటం వల్ల కండరాలు, మరియు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
క్యాన్సర్:
అశ్వగంధలో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా ఉన్నాయి. అందుకే, క్రమం తప్పకుండా అశ్వగంధ వాడితే… క్యాన్సర్ బారినుండీ బయట పడొచ్చు.
డయాబెటీస్:
డయాబెటిక్ పేషెంట్లలో ఇన్సులిన్ స్థాయిలని పెంచేందుకు కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో ‘ట్రైగ్లిజరైడ్స్’ అంటే – చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
లైంగిక అసమర్థత:
లైంగిక అసమర్థతతో బాధపడుతున్న స్త్రీలకు అశ్వగంధ ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే, స్త్రీ, పురుషుల మద్య పరస్పర వాంఛను మెరుగు పరచడంలో అశ్వగంధ ఎంతగానో దోహదపడుతుంది.
సంతానోత్పత్తి:
పురుషులలో పునరుత్పత్తి హార్మోన్ స్థాయిలను తిరిగి సమతుల్యం చేయడం ద్వారా స్పెర్మ్ కౌంట్ ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. అలాగే, పురుషులలో సంతానోత్పత్తికి సంబందించిన టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.
కొలెస్ట్రాల్:
శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించడంలో అశ్వగంధ ఎంతో బాగా పని చేస్తుంది. దీనిద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలను కూడా ఇది రాకుండా చేస్తుంది.
చర్మ సౌందర్యం:
చర్మ సౌందర్యానికి, అశ్వగంధ మంచి ప్రయోజనాలను అందిస్తుంది. మృదువైన, కాంతివంతమైన చర్మం కావలి అనుకునే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
జుట్టు సమస్యలు:
అశ్వగంధ జుట్టు కుదుళ్లకి మంచి పోషణనిచ్చి జుట్టుకు బలాన్ని కూడా ఇస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
గాయాలను, పుండ్లు:
శరీరంపై ఏర్పడిన గాయాలు, పుండ్లను మానిపించడంలో ఎంతో సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి గాయాలు, పుండ్లు త్వరగా మానేలా చేస్తుంది.
మోనోపాజ్:
వయసు పైబడిన మహిళలలో సహజంగా వచ్చే మోనోపాజ్ దశలో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రుతుక్రమం ఆగే సమయంలో మహిళలు తీవ్ర ఒత్తిడి, చికాకు, ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి సమయంలో ఇది మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్ర విసర్జన రూపంలో మన శరీరం లో నిల్వ ఉండే విషతుల్య పదార్థాలన్నీ బయటకు వచ్చేసేలా చేస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి ఎన్నో… మరెన్నో… అనారోగ్య సమస్యలని ఈ అశ్వగంధ దూరం చేస్తుంది. అందుకే, దీనిని ‘మాయా మూలిక’ అన్నారు.
అయితే ఈ అశ్వగంధని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. టాబ్లెట్స్, క్యాప్సూల్స్, టీ, పౌడర్, టింక్చర్, మరియు సప్లిమెంట్‌ల రూపంలో దీనిని వినియోగిస్తారు. ఇంకా దీన్ని సులభంగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అదెలాగంటే –
- కొద్దిగా అశ్వగంధ పొడిని తీసుకుని వేడి నీళ్లలో కలపాలి. ఆ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే తేడాను ఖచ్చితంగా గమనించగలరు.
- అశ్వగంధ మూలికలని తెచ్చి, వాటిని ఒక గిన్నెలో వేసి, నీళ్ళు పోసి, బాగా మరగనివ్వాలి. ఆ హెర్బ్స్ లో ఉన్న సారమంతా నీళ్ళల్లో దిగిన తర్వాత ఆనీటిని వడబోసి… అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
- బయట మార్కెట్లో అశ్వగంధ టింక్చర్, మరియు సప్లిమెంట్స్ రకరకాల రూపాల్లో దొరుకుతున్నాయి.
- ఇవేకాక ఇంకా మెడికల్ స్టోర్స్ లో అశ్వగంధ టాబ్లెట్స్, మరియు క్యాప్సూల్స్ లభిస్తున్నాయి.
ఇలా అశ్వగంధని ఏ రూపంలో తీసుకున్నా అద్భుత ప్రయోజనాలని అందిస్తుంది.