Diwali 2024: టపాసుల పొగతో పొంచి ఉన్న ముప్పు!

దీపావళి అంటే పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టం. సరదా సరదా చిచ్చుబుడ్లు, రివ్వున ఎగిరే తారాజువ్వలు, గిరగిరా తిరిగే భూ చక్రాలు, డాం… డాం… అని పేలే లక్ష్మీ ఔట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల టపాసుల మోతతో చెవులు దద్దరిల్లిపోతాయి. మొత్తం మీద అందరూ దీపావళిని ఎంతో ఆనందోత్సాహాలతో సెలెబ్రేట్ చేసుకుంటారు.

ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఆనందం వెనుక విషాదం కూడా దాగి ఉంది. క్రాకర్స్ నుండీ వచ్చే పొగ మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణం మరియు జీవజాలంఫై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మరి దీపావళి వాయు కాలుష్యం వల్ల వచ్చే ఆ ఆరోగ్య సమస్యలేంటో… వాటిని ఎలా అధిగమించాలో… ఇప్పుడు తెలుసుకుందాం.

క్రాకర్స్ కాల్చడం ఎందుకు హానికరం?

క్రాకర్లు కాల్చడం వల్ల గాలిలోకి కాలుష్య కారకాలు గణనీయమైన స్థాయిలో విడుదలవుతాయి. ఈ కాలుష్య కారకాలలో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కెమికల్స్ ఉన్నాయి. ఈ రసాయనాలని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, హృదయ సంబంధ వ్యాధులు, ఆస్తమా మరియు బ్రోన్కైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆల్రెడీ ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడుతున్న వారైతే వారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు ఇతర అనారోగ్య సమస్యలు కలిగి ఉన్న వ్యక్తులకు దీనవల్ల మరింత హాని కలుగుతుంది.

క్రాకర్లలో ఏయే రసాయనాలని ఉపయోగిస్తారు?

క్రాకర్లను పేలుడు స్వభావానికి దోహదపడే విధంగా వివిధ రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు. సాధారణంగా ఉపయోగించే కొన్ని రసాయనాలు ఇవి:

పొటాషియం నైట్రేట్, సల్ఫర్, బొగ్గు, అల్యూమినియం, బేరియం నైట్రేట్, స్ట్రోంటియం నైట్రేట్, మరియు కాపర్ కాంపౌండ్స్.

ఈ కెమికల్స్ ని కాల్చినప్పుడు, ఎయిర్ పొల్యూషన్ కి దోహదపడే విషపూరిత పొగలను విడుదల చేస్తాయి మరియు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి.

వాయు కాలుష్యం

టపాసులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం ఎక్కువ. మీరు దీపావళి రోజు దట్టమైన పొగ మేఘాలను చూసి ఉండే ఉంటారు. దానికి క్రాకర్స్ తప్ప వేరే కారణం లేదు.

బాణసంచా కాల్చినప్పుడు, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, ట్రైఆక్సిజన్ మరియు బ్లాక్ కార్బన్ వంటి విషపూరిత వాయు కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి మరియు దట్టమైన పొగ మేఘాల ఉత్పత్తికి దారితీస్తాయి. ఇది కళ్లు, గొంతు, ఊపిరితిత్తులు, గుండె మరియు చర్మంపై ప్రభావం చూపుతుంది.

వినికిడి సమస్యలు

పటాకుల పెద్ద శబ్దాలు శబ్ద కాలుష్యానికి దారితీస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది యువకులను అంతగా ప్రభావితం చేయకపోవచ్చు, కానీ ఇది మన వృద్దులకు మరియు చిన్న పిల్లలకు పీడకలగా మారుతుంది.

ఈ రెండు వయసులకి చెందినవారూ సున్నితమైన వినికిడిని కలిగి ఉంటారు. అందుకే త్వరగా పెద్ద శబ్దాల వల్ల ప్రభావితమవుతాయి. పటాకుల శబ్దం కారణంగా వీళ్ళు వినికిడిని కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, చెవులు దద్దరిల్లే బాంబుల మోత కారణంగా ఏ వయసు వారికైనా కర్ణభేరి దెబ్బతిని వినికిడి సమస్యలు తలెత్తుతాయి.

శ్వాసకోశ సమస్యలు

ఫైర్ క్రాకర్స్ కాల్చినప్పుడు కాలిలో దుమ్ము యొక్క గాఢత విపరీతంగా ఉంటుంది. ఇది ఆస్తమా, అలెర్జీ, మరియు బ్రోన్కైటిస్ వంటివి ఉన్నవారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

వాయు కాలుష్య కారకాలు COPD, ILD వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులను ప్రేరేపిస్తాయి. దీని ద్వారా ఆసుపత్రిలో చేరే రేట్లు మరియు మందుల వినియోగాన్ని పెంచుతాయి. వీతినుండీ విడుదలయ్యే విష వాయువులు పూర్తిగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో కూడా తీవ్రమైన రియాక్టివ్ ఎయిర్‌వే డిస్‌ఫంక్షన్ (RADS)కి కారణమవుతాయి.

ఇది కూడా చదవండి: ఆస్తమా వ్యాధి గ్రస్తులలో వచ్చే గురకను సింపుల్ గా తగ్గించుకోండి ఇలా..!

కళ్లపై ప్రభావం

ఫైర్ క్రాకర్స్ కాల్చినప్పుడు వాటినుంచీ వచ్చే లైటింగ్ కారణంగా కంటికి ఇన్స్టంట్ ఇరిటేషన్ ని కలిగిస్తుంది. ఫలితంగా కళ్ళు ఎర్రబడటం, నీరు కారటం, మండటం, మరియు కళ్ళు పొడిబారిన అనుభూతిని కలిగిస్తుంది.

ఇంకా పిల్లల్లో ఒక్కోసారి అలెర్జీలకు గురయ్యే అవకాశం కూడా వస్తుంది. కణాలు నేరుగా కంటిలోకి దిగినప్పుడు కార్నియల్ రాపిడిలో నొప్పి, కాంతిని చూడలేకపోవటం, మరియు బ్లర్ విజన్ కి కారణం కావచ్చు.

ఈ కంటి సమస్యలు దీర్ఘకాలంపాటు కొనసాగితే డ్రై ఐ సిండ్రోమ్ వంటి క్రానిక్ ఐ డిసీజెస్ కి దారితీయవచ్చు. దీనివల్ల రెటీనా దెబ్బతిని సాదారణ కంటిచూపు కూడా కోల్పోవచ్చు.

ముగింపు

దీపావళి సందర్భంగా క్రాకర్లు పేల్చే సంప్రదాయం బాగా పాతుకుపోయినప్పటికీ, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం.

ఆనందంతో మనం జరుపుకొనే పండుగలు మన శ్రేయస్సు మరియు పర్యావరణ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని జరుపుకుందాం.

డిస్క్లైమర్:

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment