జామ ఆకుల టీ తో ప్రయోజనాలెన్నో!

టీలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మనకి తెలిసి పాల టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఎల్లో టీ, లెమన్ టీ, అల్లంటీ ఇలా కొన్ని రకాల టీలు గురించి మనం విన్నాం. కానీ, జామ ఆకుల టీ గురించి ఎప్పుడూ విని ఉండం. జామ కాయలలో ఎన్నో రకాల ప్రోటీన్లు దాగి ఉన్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా మధుమేహ గ్రస్తులకి ఇది ఎంతో మంచిది.

జామకాయను సూపర్ ఫ్రూట్‌గా చెప్తుంటారు. కారణం జామకాయ 80% నీటిని కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి, మరియు అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే జామ ఆకుల్లో కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయట. ఇందులో విటమిన్ సి, మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండుటచేత ఈ టీ తాగితే కడుపు క్లీన్ అవుతుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఒక రకమైన యాంటీఆక్సిడెంట్.

హెల్త్ కేర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వారు రోజూ ఉదయం ఈ జామ ఆకుల టీ తాగాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. మరి అలాంటి జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

జామకాయ, జామ ఆకులు ఈ రెండూ కూడా విటమిన్ సితో సమృద్ధిగా నిండి ఉంటాయి. అందుకే ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్లను, అనారోగ్యాలను రాకుండా చేస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు శరీరంలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, మరియు వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

వృద్ధాప్య లక్షణాలని తగ్గిస్తుంది:

జామ ఆకులో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి చాలా మృదుత్వాన్ని ఇస్తాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య లక్షణాలని తగ్గిస్తాయి. అంతేకాకుండా జామ ఆకుల టీలో ఉండే యాంటీమైక్రోబయాల్ లక్షణాలు చర్మాన్ని మొటిమల నుంచి కాపాడుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

జామ ఆకుల టీ తాగటం వల్ల వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆకలిని అరికడుతుంది. దీనివల్ల శరీరం నుంచి అదనపు పౌండ్లు కరిగిపోతాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

ఇందులో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్‌ నుండీ రక్షిస్తుంది. దీంతో క్యాన్సర్ కణాల వృద్ధి తగ్గుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది: జామ ఆకులలో తగిన పరిమాణంలో పొటాషియం కంటెంట్ ఉంటుంది. అలాగే, జామకాయ మొత్తం ఫైబర్​తో నిండి ఉంటుంది. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.

డిస్క్లైమర్:

పైన తెల్పిన విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే! ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులని సంప్రదించండి.

Leave a Comment