వేసవి తాపాన్ని తీర్చే మజ్జిగ రకాలు

పూర్వకాలంలో బయటనుంచీ ఇంటికి రాగానే వారికి మజ్జిగని ఇచ్చేవారు. కారణం మజ్జిగ ఆరోగ్యానికి మంచిదనీ… ఇది శరీరాన్ని చల్లబరుస్తుందనీ… అలాగే, కడుపుకి మేలు చేస్తుందనీ.

ఇక వేసవిలో ఎండ వేడికి శరీరంలోని నీరంతా విపరీతంగా ఆవిరైపోతుంది. అలాంటి సందర్భంలో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలా కాకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవటం అవసరం. నీరు శరీరాన్ని చల్లబరిచి వాటర్ లెవెల్స్ ని పెంచుతుంది. అయితే నీరు మాత్రమే కాకుండా ఇంకా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి కూడా తీసుకోవచ్చు. ఎండ తాపాన్ని తగ్గించటంలో ఆన్నిటికన్నా మజ్జిగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్‌… శరీరంలో ఉండే వ్యాధులని దూరం చేస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందువల్ల వీలైనంత ఎక్కువగా మజ్జిగని తీసుకొంటే బెటర్.

అయితే, మనం తాగే ఈ మజ్జిగలో కొన్ని రకాల ఫ్లేవర్స్ ని జోడించటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు, అవేంటో ఇప్పుడు చూద్దాం.

పుదీనా మజ్జిగ:

పుదీనా మజ్జిగ ఒక డిటాక్సింగ్ డ్రింక్‌ లా పనిచేస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగు పరుస్తుంది. అజీర్ణం, కడుపు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే, కడుపుకి చలువ చేస్తుంది. ఇంకా తలనొప్పి, వికారం వంటి వాటిని కూడా దూరం చేస్తుంది.

కావలసిన పదార్ధాలు:

 • పెరుగు – 1 కప్పు
 • నల్ల మిరియాల పొడి – ¼ స్పూన్
 • ఉప్పు – ¼ స్పూన్
 • నీరు – 2 కప్పులు
 • పుదీనా ఆకులు – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:

ఈ పదార్థాలన్నిటినీ బ్లెండర్‌లో వేసి సర్వ్ చేసుకోవాలి.

బీట్‌రూట్ మజ్జిగ:

బీట్‌రూట్ మజ్జిగ ఎనర్జీని పెంచుతుంది. ఇంకా ఇది బ్లడ్ ప్రెజర్ ని అదుపులో ఉంచుతుంది.

కావలసిన పదార్ధాలు:

 • పెరుగు – ½ కప్పు
 • నీరు – 2 కప్పులు
 • ఉప్పు – తగినంత
 • తరిగిన బీట్‌రూట్ – 1/4 కప్పు
 • పచ్చిమిర్చి – 1
 • తరిగిన అల్లం – ½ టేబుల్ స్పూన్
 • కొత్తిమీర ఆకులు – కొద్దిగా
 • పుదీనా ఆకులు – కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా బీట్‌రూట్‌ చెక్కు తీసి… ముక్కలుగా చేసి… అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసి బాగా గిలక్కొట్టుకోవాలి. ఆ మిశ్రమంలో నీళ్లు, ఉప్పు, బీట్‌రూట్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు బీట్‌రూట్ బటర్ మిల్క్ రెడీ.

జీలకర్ర మజ్జిగ:

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇంకా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయటంలో హెల్ప్ అవుతుంది.

కావలసిన పదార్ధాలు:

 • పెరుగు – 1 కప్పు
 • ఇంగువ – ¼ టీస్పూన్
 • ఉప్పు – 1 స్పూన్
 • నీరు – 2 కప్పులు
 • కాల్చిన జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
 • కొత్తిమీర ఆకులు – 1 స్పూన్

తయారీ విధానం:

పైన చెప్పిన పదార్థాలన్నిటినీ బ్లెండ్ చేసి సర్వ్ చేయాలి.

బార్లీ మజ్జిగ:

బాడీ హీట్ ని కంట్రోల్ చేస్తుంది.

కావలసిన పదార్ధాలు:

 • బార్లీ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
 • నీరు – 1 ½ కప్పు
 • పెరుగు – 1 కప్పు
 • అల్లం రసం – 1 స్పూన్
 • కాల్చిన జీలకర్ర పొడి – ½ టేబుల్ స్పూన్
 • నల్ల మిరియాలు పొడి – ¼ స్పూన్
 • చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:

అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఆకలి పెరుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

మసాలా మజ్జిగ:

మసాలా మజ్జిగ గొప్ప సమ్మర్ కూలింగ్ ఏజెంట్. ఇది ఎండా కాలంలో వేడిని అధిగమించడానికి సహాయపడుతుంది. బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ నుండి కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది.

కావలసిన పదార్ధాలు:

 • పెరుగు – ½ కప్పు
 • నీరు – 2 కప్పులు
 • ఉప్పు – తగినంత
 • పచ్చిమిర్చి – 1
 • తరిగిన అల్లం – ½ టేబుల్ స్పూన్
 • కొత్తిమీర కాడలు – 4
 • కరివేపాకు ఆకులు – కొన్ని

తయారీ విధానం:

ముందుగా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేయాలి. గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టి, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసుకోవాలి.

ఈ మజ్జిగ వెరైటీలన్నీ వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని, శరీరానికి శక్తిని అందిస్తాయి. రోజూ ఓకే విధమైన మజ్జిగని తాగటం వల్ల బోర్ కొడుతున్నట్లయితే, ఇలా రకరకాల ఫ్లేవర్లు మిక్స్ చేసుకొని తాగటంవల్ల వేసవి తాపం దూరమవుతుంది. ఆరోగ్యంగానూ ఉండవచ్చు.

Leave a Comment