గ్రీన్ టీ ఇలా తాగడం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువ

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై ప్రత్యేకించి శ్రద్ధ పెట్టటం అస్సలు కుదరదు. అందుకే దానికి బదులుగా గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి గ్రీన్ టీ తాగే అలవాటు మంచిదే కానీ టూ మచ్ గా తాగటం అస్సలు మంచిది కాదు.

గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవ్వటమే కాకుండా, జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. అలాగే ఊబకాయం తగ్గుతుంది. ఇంకా స్కిన్ గ్లోయింగ్ పెరుగుతుంది. ఈ విషయం తెలిసి ఇటీవల చాలామంది ఈ గ్రీన్ టీని విపరీతంగా తాగటం మొదలుపెట్టారు. అయితే, గ్రీన్ టీ తాగడం వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి? ఎలాంటి వారు తాగాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో తాగకూడదు:

కొంతమంది గ్రీన్ టీతోనే తమ దినచర్యని ప్రారంభిస్తారు. అది చాలా తప్పు. ఖాళీ కడుపుతో ఎప్పుడూ గ్రీన్ టీ తాగకండి. ఇది ఎసిడిటీకి కారణం అవుతుంది. అందుకే గ్రీన్ టీ తాగాలనుకొనేవారు ముందుగా ఏదైనా తినండి. 1 గంట తర్వాత గ్రీన్ టీ తాగండి.

ఆహారంతో పాటు తాగవద్దు:

కొంతమంది ఆహారంతో పాటు నీటికి బదులుగా గ్రీన్ టీ తాగుతారు. లేదా ఆహారం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగుతారు. ఇలా చేస్తే మేలు చేయటం మాట పక్కన పెడితే, హాని కలుగుతుంది. తిన్న వెంటనే కొంత గ్యాప్ తీసుకోని గ్రీన్ టీ తాగొచ్చు. అంటే సుమారు 40 నిమిషాల నుంచి ఒక గంట తర్వాత మాత్రమే దీనిని తీసుకోవాలి. గ్రీన్ టీలో ఉన్న కాటెచిన్స్ కారణంగా మన శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించదు. అందువల్ల గ్రీన్ టీ ఎక్కువగా తాగితే బాడీలో ఐరన్ లోపిస్తుంది. అందుకే ఆహారంతో పాటు కానీ, ఆహారం తిన్న వెంటనే కానీ గ్రీన్ టీ తాగకూడదు.

టూమచ్ గా తాగకండి:

బరువు తగ్గే క్రమంలో కొంతమంది గ్రీన్ టీని రోజులో చాలాసార్లు తాగుతారు. 1 కప్పు గ్రీన్ టీలో 24-25 మి.గ్రా వరకూ కెఫిన్ ఉంటుంది. అలాంటిది రోజుకు 4-5 కప్పుల గ్రీన్ టీ తాగితే, అది శరీరంలో కెఫిన్ స్థాయిని పెంచుతుంది. ఇది భయం, ఆందోళన, గుండెల్లో మంట, తల తిరగడం, మధుమేహం, నిద్రలేమికి దారితీస్తుంది.

మందులతో కలిపి తాగొద్దు:

ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉండి… మందులు తీసుకుంటుంటే వాటితో కలిపి గ్రీన్ టీ తాగవద్దు. ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించి. ఇలా గ్రీన్ టీతో కలిపి మందులు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

గర్భధారణ సమయంలో అస్సలు తాగవద్దు:

గర్భధారణ సమయంలో గ్రీన్ టీ అసలే తాగకూడదు. అంతేకాదు, బిడ్డ తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ పాల ద్వారా శిశువు శరీరంలోకి చేరుతుంది. ఇది శిశువు అనారోగ్యానికి దారి తీస్తుంది.

డిస్క్లైమర్:

ఎంత ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ గ్రీన్ టీ రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. ఖాళీ కడుపుతో అసలే తాగకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే దీనిని తీసుకోవాలి. నిద్రపోయే ముందు తాగే అలవాటు ఉంటే మానుకోండి. సింపుల్ గా చెప్పాలంటే… ఉదయం 10-11 గంటల మధ్య, అలానే సాయంత్రం 5-6 గంటల మద్య దీనిని తీసుకొంటే బెటర్.

మరొక్క చిన్న విషయం ఏమిటంటే, దీనిని తీసుకొనే ముందు డాక్టర్ సలహాలు, సూచనలు పాటించటం మర్చిపోకండి.

ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమేనని గుర్తించండి. అంతకుమించి healthyfabs.com ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment