చిరుధాన్యాలు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే… ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

ఈమధ్య కాలంలో తృణధాన్యాలపై ఎక్కువగా అందరూ మక్కువ చూపుతున్నారు. కారణం ఇవి శరీరానికి కావలసినంత పోషణని అందిస్తాయన్న ఉద్దేశ్యంతో. నిజానికి ఈ చిరుధాన్యాలతో చేసిన ఆహారం అనేది ఇప్పుడిప్పుడే వస్తున్న ఆచారం కాదు. పూర్వకాలంలో ఎక్కువగా అందరూ ఈ ఆహారాన్నే తీసుకొనేవారు.

చిరు ధాన్యాలలో విటమిన్ బి, ఫైబర్, మినరల్స్, అమైనో యాసిడ్స్, కాల్షియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషణ అందించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గోధుమలు తినలేని వారికి ఈ మిల్లెట్స్ ఓ గొప్ప ఆల్టర్నేటివ్. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఉలవలు మొదలైన వాటిని చిరుధాన్యాలుగా చెప్పుకుంటాం. వీటిని డైరెక్ట్ గా తీసుకోవచ్చు, పిండి చేసి రొట్టెల్లా చేసుకొని తినొచ్చు, సంకటి లా చేసుకోవచ్చు, లేదా ఆహార పదార్ధాలలో కలిపి వండుకోవచ్చు. ఎలా తిన్నా రుచిగానే ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు:

 • టైప్-2 డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు. దీనిని తీసుకోవటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
 • అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి శరీరంలో పేరుకు పోయిన అధిక కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
 • ఉదర సంబంధ సమస్యలని నివారించే గొప్ప ఔషధం.

ఇలా ఎన్నో పోషకాలను అందించే చిరు ధాన్యాలు తినడం వల్ల ఎన్నో ప్రయోనాలు ఉన్నప్పటికీ, తిన్న తర్వాత చాలా మందికి మలబద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, వికారం, గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే, వీటిని సరైన పద్ధతిలో తీసుకొన్నట్లైతే, ఆ సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటి చిరుధాన్యాలని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

 • ప్రారంభంలో మీ ఆహారంలో మిల్లెట్లను ప్రవేశపెట్టినప్పుడు, వాటిని రోజుకు ఒకసారి మాత్రమే తినడానికి పరిమితం చేయండి. మీ శరీరం వాటికి అలవాటు పడే వరకు ఇదే కంటిన్యూ చేయండి. తర్వాత ఫ్రీక్వెన్సీని రోజుకు రెండు లేదా మూడు సార్లు పెంచండి.
 • పచ్చిగా ఉన్న మిల్లెట్స్ ని నేరుగా తినడం వల్ల ఇవి వాతాన్ని పెంచుతాయి. అందువల్లే కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. ఆల్రెడీ వాతంతో బాధపడుతున్న వారైతే వారిని మరింత ఇబ్బందులకి గురిచేస్తాయి.
 • ఈ ధాన్యాలు వాటంతట అవే మలబద్దకం కావు. ఇవి బాగా ముతకగా ఉంటాయి కాబట్టి వీటిని తినేటప్పుడు, ఎక్కువ సేపు నమలడం మంచిది. ఇలా చేయటం వల్ల జీర్ణవ్యవస్థ వాటిని విచ్ఛిన్నం చేయడం ఈజీ అవుతుంది.
 • ఆహారంలో మిల్లెట్లను చేర్చుకున్నప్పుడు, రోజంతా ఎక్కువ నీరు త్రాగాలి.
 • మిల్లెట్స్ ని తినడానికి ముందు కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు బాగా నీటిలో నానబెట్టాలి.
 • వీటిని వండేటప్పుడు నెయ్యి, రాతి ఉప్పు, శొంఠి పొడి వంటివి వేయాలి. ఇలా చేయటం వల్ల కడుపుకు హాని చేయవు.
 • చిరుధాన్యాలతో తయారుచేసే పదార్థాలు తినేటప్పుడు బాగా ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకోవాలి.

  డిస్క్లైమర్:

కొన్ని హెల్త్ జర్నల్స్, మరియు రీసర్చిల నుంచి సేకరించిన సమాచారాన్ని మాత్రమే మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. అంతేకాని ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా… వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మర్చిపోకండి.

Leave a Comment