మాన్ సూన్ సీజన్ వచ్చిందంటే చాలు, దోమల బెడద తప్పదు. ఆరోగ్యంగా ఉండాలంటే, స్వచ్చమైన గాలి కావాలి. కానీ, ఆ గాలి కోసం కిటికీలు, తలుపులు తెరిస్తే, దోమలు, పురుగులు ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో మనం దోమలని నివారించటానికి మస్కిటో కాయిల్స్, లేదా లిక్విడ్ రిపెల్లెంట్లను ఉపయోగిస్తుంటాం. నిజానికి దోమలు చాలా ప్రమాదకరం. కానీ దోమలను చంపే మస్కిటో కాయిల్స్ ఆరోగ్యానికి ఎంతో హానికరం.
మస్కిటో కాయిల్స్ కాలుతున్నప్పుడు బయటకు వచ్చే పొగ, అలానే లిక్విడ్ రిపెల్లెంట్ల నుండీ వెలువడే రసాయనాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఈ విషయం తెలిసీ కూడా వాటినే ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేస్తున్నారు.
ఒక మస్కిటో కాయిల్… 75 కంటే ఎక్కువ సిగరెట్ల పొగను ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టమ్ ని దెబ్బ తీస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడతారు.
అలాగే, మస్కిటో కాయిల్స్ కాలుతున్న సమయంలో బయటకు వచ్చే పొగ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల బ్రోన్కియోలిటిస్, ఆయాసం, ఉబ్బసం వంటివి కలుగుతాయి. ఇంకా దీని కారణంగా శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి.
లిక్విడ్ రిపెల్లెంట్స్ లో ఉండే కెమికల్స్ వల్ల శరీరంపై అలెర్జీ, దురద వంటివి రావచ్చు. కొన్నిసార్లు కళ్లలో మంట, లేదా దురదను కలిగించవచ్చు. మస్కిటో కాయిల్స్ నుండి వెలువడే పొగ ఆ ప్రదేశంలోని గాలిని కలుషితం చేస్తుంది. అలాంటి గాలిని పీల్చడం వల్ల తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, వికారం, తలతిరగటం వంటివి కూడా సంభవిస్తాయి.
చివరిమాట:
గదిలో మస్కిటో కాయిల్స్, లేదా లిక్విడ్ రిపెల్లెంట్స్ ని ఉపయోగిస్తున్నప్పుడు మీ పిల్లలను ఆ గది నుండి దూరంగా ఉంచండి. పిల్లలు గదిలోకి రావడానికి ముందు కిటికీలు, తలుపులు తెరవండి. తద్వారా స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. వీలైనంతవరకూ తలుపు, లేదా కిటికీ వెలుపల కాయిల్స్‌ను కాల్చండి. అలా చేయటం వల్ల దోమలు ప్రవేశించవు. గదిలో మస్కిటో కాయిల్స్, లిక్విడ్‌లను ఆన్‌లో ఉంచుకుని ఎప్పుడూ నిద్రపోకండి. అందుకే దోమతెరలు వాడటం శ్రేయస్కరం అని వైద్యులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్:
ఈ విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! అంతకు మించి HealthyFabs ఎలాంటి బాధ్యతా వహించదు.